New Delhi: ఢిల్లీలో ఏమాత్రం తగ్గని కాలుష్యం.. విద్యాసంస్థలు బంద్

Schools and Colleges In And Near Delhi Closed
  • దీపావళి తర్వాతి నుంచి కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీ
  • ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీల మూత
  • ఆన్‌లైన్ విద్యాబోధన కొనసాగించాలని ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థితి నుంచి బయటపడడం లేదు. గత కొన్ని రోజులుగా ఇక్కడి కాలుష్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చివరికి సుప్రీంకోర్టు కూడా కల్పించుకోవాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మెరుగుదల కనిపించకపోవడంతో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీతోపాటు సమీపంలోని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాలు జారీ చేసింది.

దీపావళి ముందు వరకు రాజధానిలో సాధారణంగానే ఉన్న వాతావరణం ఆ తర్వాతి రోజు నుంచి ఒక్కసారిగా మారిపోయి, నగరం నిండా కాలుష్యం కమ్ముకుంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోయారు. పరిస్థితుల్లో ఇప్పటికీ ఎటువంటి మార్పు లేకపోవడంతో ప్రభుత్వం తాజాగా స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నట్టు ప్రకటించింది.

అయితే, ఆన్‌లైన్‌లో బోధనలు కొనసాగించాలని ఆదేశించింది. అలాగే, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లోని ఆయా కంపెనీలన్నీ ఈ నెల 21 వరకు 50 శాతం ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహించాలని, మిగతా 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాలని సీఏక్యూఎం ఆదేశించింది. రాజధాని ప్రాంతంలోని ప్రైవేటు సంస్థలు కూడా 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇవ్వాలని కోరింది.
New Delhi
Air Quality
Pollution
Scools
Colleges

More Telugu News