New Delhi: రైతుల రాబడి ఎంతో తెలుసా?.. స్టార్ హోటళ్లలో కూర్చుని రైతులపై అభాండాలు వేస్తారా?: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఫైర్

Supreme Court CJI Fires On Public Commenting On Farmers

  • నిషేధం ఉన్నా బాణసంచా కాలుస్తారా?
  • దీపావళి అయిపోయి 10 రోజులవుతున్నా కాల్చడమేంటి?
  • ప్రజలకూ బాధ్యత ఉందన్న విషయం మరువొద్దు
  • ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు
  • సీజేఐ ఎన్వీ రమణ మండిపాటు

ఢిల్లీ కాలుష్యానికి రైతులను బాధ్యులను చేయడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యానికి రైతులు ఎలా కారణమో చెప్పాలంటూ మండిపడింది. ‘‘కొందరు ఢిల్లీలోని ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో కూర్చొని కాలుష్యానికి కారణం రైతులేనంటూ అభాండాలు వేస్తున్నారు. అసలు వారికున్న భూమితో రైతులకొచ్చే ఆదాయం ఎంతో ఈ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్న వారికి తెలుసా?’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మండిపడ్డారు.

నిషేధం ఉందని తెలిసినా బాణసంచా కాలుస్తున్నామన్న విషయాన్నే అందరూ మరచిపోయారని అసహనం వ్యక్తం చేశారు. దీపావళి అయిపోయి 10 రోజులవుతున్నా టపాసులను ఇంకా ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకూ కొంత బాధ్యత ఉండాలన్నారు. ప్రతిదీ కోర్టు ఆదేశాలతోనే జరగడం సాధ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ దీనిని ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ ఆఫీసులను ఓ రెండు రోజుల పాటు ఎందుకు మూసేయలేదు? అంటూ ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీని జస్టిస్ సూర్య కాంత్ ప్రశ్నించారు. ఆఫీసులు లేని రోజున ట్రాఫిక్ మొత్తాన్ని ఎందుకు ఆపేయడం లేదు? అని ప్రశ్నలు సంధించారు. అయితే, కాలుష్యం ఎక్కువున్న రాష్ట్రాల్లో పూర్తిగా ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పించిన రాష్ట్రం కేవలం ఢిల్లీయేనని అభిషేక్ తెలిపారు. అందరికీ ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్టు చెప్పారు.

కాలుష్య నివారణకు తనిఖీలు చేస్తున్నారని, వివిధ చర్యలూ చేపట్టారని.. అయితే, వాటికి తోడు కొన్ని పాజిటివ్ చర్యలూ తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సూచించారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లకుండా సీఎన్జీ బస్సులను రవాణా కోసం ఏర్పాటు చేస్తే బాగుండేదన్నారు.

అయితే, ఆ బస్సులను ఏదో కొన్ని రోజుల పాటు నడిపేందుకు కొనలేమని, కాలుష్య నివారణకు వాటిని శాశ్వత పరిష్కారంగా చూడాల్సిన అవసరం ఉందని అభిషేక్ మను సంఘ్వీ కోర్టుకు తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే వాహనాలపై ‘సరి–బేసి’ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

గాలిలోని కాలుష్యాన్ని శుభ్రం చేసేందుకు 15 కొత్త యంత్రాల కొనుగోలుకు ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇక, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు కొనుగోలు చేయడమే తరువాయి అని తెలిపారు. ఆ పరికరాల కొనుగోలు కోసం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News