India: గాంధీ, నేతాజీ మధ్య అంతగా సత్సంబంధాల్లేవు.. దేశ స్వాతంత్ర్యంపై నేతాజీ కూతురు అనిత సంచలన వ్యాఖ్యలు
- అహింసా విధానాల వల్లే రాలేదని కామెంట్
- నేతాజీ, ఐఎన్ఏ చర్యలూ కారణమేనని వెల్లడి
- కొన్ని లక్షల మంది పోరాటం వల్ల స్వాతంత్ర్యం వచ్చిందన్న అనిత
మహాత్మా గాంధీ, తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవని నేతాజీ కూతురు అనితా బోస్ ఫాఫ్ అన్నారు. నేతాజీని అదుపులో పెట్టలేనంటూ గాంధీ అనేవారని గుర్తు చేశారు. మరోవైపు గాంధీ అంటే తన తండ్రి నేతాజీకి అమితమైన అభిమానమని చెప్పారు. నేతాజీని మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూలే బ్రిటీషర్లకు అప్పగించేందుకు ప్రయత్నించారన్న కామెంట్లపై ‘ఇండియా టుడే’ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ, నేతాజీలిద్దరూ హీరోలేనని ఆమె శ్లాఘించారు. ఆ ఇద్దర్లో ఏ ఒక్కరు లేకపోయినా అది సాధ్యమయ్యేది కాదన్నారు. కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో చెబుతున్నట్టుగా.. కేవలం అహింసా విధానాల వల్లే స్వాతంత్ర్యం రాలేదని స్పష్టం చేశారు. నేతాజీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) చర్యలూ దేశ స్వాతంత్ర్యానికి కారణమన్నారు. అలాగని నేతాజీ, ఐఎన్ఏ వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పడం కూడా కరెక్ట్ కాదన్నారు. తన తండ్రి సహా ఎందరికో గాంధీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కొన్ని లక్షల మంది పోరాటం, త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.