Team India: తొలి టీ20 మనదే.. కివీస్‌పై గెలిచిన రోహిత్ సేన
- మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్న భారత్
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా సూర్యకుమార్ యాదవ్
- టీ20లో కివీస్‌పై ఓటమికి భారత్ ప్రతీకారం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి న్యూజిలాండ్‌తో జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
రోహిత్ తొలుత దూకుడుగా ఆడడంతో భారత్ 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఆ తర్వాత రోహిత్ అవుటైనా క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో మ్యాచ్ త్వరగానే ముగుస్తుందని భావించారు. అయితే, చివర్లో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో పరుగులు రావడం కష్టమయ్యాయి. దీనికితోడు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ (5), వెంకటేశ్ అయ్యర్ (4) వెంటవెంటనే అవుట్ కావడంతో భారత జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది.
చివర్లో రిషభ్ పంత్ (17) జాగ్రత్తగా ఆడాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతిని బౌండరీకి తరలించిన పంత్ భారత్‌కు విజయాన్ని అందించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 2 వికెట్లు తీసుకోగా, సౌథీ, శాంట్నర్, మిచెల్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడిన ఓపెనర్ మార్టిన్ గప్టిల్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. చాప్మన్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేయడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో నిలిచింది. రెండో టీ20 రేపు రాంచీలో జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడిన భారత్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది.