Business: ఆదిలోనే హంసపాదు.. లిస్టింగ్ రోజునే భారీగా నష్టపోయిన పేటీఎం షేర్ల విలువ
- రూ.2,150 ఇష్యూ ధరతో ఐపీవో
- నేడు రూ.1,950కి లిస్టింగ్
- ఇంట్రాడేలో 25% పడిపోయిన షేర్ ధర
- ప్రస్తుతం రూ.1,586 వద్ద ట్రేడింగ్
దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) మార్కెట్ లోకి అడుగు పెట్టిన పేటీఎంకు షేర్లు లిస్టయిన తొలిరోజే నష్టాలు పట్టుకున్నాయి. ఐపీవోకి మదుపరుల నుంచి అంతగా స్పందన రాకపోవడంతో 1.89 రెట్లు మాత్రమే సబ్ స్క్రైబ్ అయింది. ఒక్కో షేర్ ఇష్యూ ధరను రూ.2,150గా నిర్ణయించిన పేటీఎం మాతృ సంస్థ ‘వన్97’ షేర్లను కేటాయించింది.
అయితే, ఈ రోజు కంపెనీ షేర్లు అందర్నీ నివ్వెరపరుస్తూ 9.3% (రూ.200) తక్కువగా రూ.1,950కి లిస్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పేటీఎం షేర్ ధర 25 శాతం నష్టపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గింది. ఇష్యూ ధర రూ.2150 కాగా.. ఇంట్రాడేలో దాని విలువ రూ.1,586కి పడిపోయింది. నష్టపోయినా కూడా సంస్థ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేయడం విశేషం.
షేర్ ఇష్యూ ధర చాలా ఎక్కువగా ఉండడం వల్లే ఇన్వెస్టర్ల నుంచి ఐపీఓకి స్పందన ఎక్కువగా రాలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేటీఎం వ్యాపార నమూనా ‘దిక్కు దివానం (ఫోకస్ అండ్ డైరెక్షన్)’ లేకుండా ఉందని, అల్పమైన రేటింగ్ తో తన కవరేజ్ ను ప్రారంభించిందని మాక్వరీ రీసెర్చ్ అనే సంస్థ విశ్లేషించింది. లాభాలను ఆర్జించడం ఇప్పుడు సంస్థకు సవాలేనని పేర్కొంది. సంస్థకు ‘ధన దాహం’ ఎక్కువైపోయిందని పేర్కొంది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఈ షేర్ల నుంచి ఎగ్జిట్ అయిపోవడం మంచిదని, మంచి అవకాశాలు వచ్చినప్పుడు తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరికొన్నేళ్ల పాటు పేటీఎం సంస్థకు నష్టాలు తప్పవని నిపుణుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
సంస్థ రూ.18,300 కోట్ల విలువైన షేర్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. అందులో రూ.8,300 కోట్ల విలువైన కొత్త షేర్లను ఆఫర్ చేస్తుండగా.. మరో రూ.10 వేల కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్ల దగ్గర ఉన్న షేర్లను ఐపీవోలో పెట్టింది. 100 మంది సంస్థాగత ఇన్వెస్టర్లకు రూ.8,235 కోట్ల విలువైన షేర్లను సంస్థ కేటాయించింది. సింగపూర్ స్టాక్ మార్కెట్ లోనూ లిస్ట్ చేసేందుకు సంస్థ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వానికి పలు కేటాయింపులను చేసింది.