YS Sharmila: పాలన చేతకాని కేసీఆర్ ధర్నాలు మాత్రమే చేస్తున్నారు: షర్మిల
- నిరుద్యోగులను చావు బాట పట్టిస్తున్నారు
- బడి బువ్వ బంద్ చేశారు
- కమిషన్ల కోసం కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. '800 స్కూళ్లలో బువ్వ పెడ్తలె'... 'ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య' అంటూ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆమె... నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చావు బాట పట్టిస్తూ... బడి బువ్వ బంద్ పెట్టి పేద బిడ్డలకు చదువును దూరం చేస్తూ... నేటి తెలంగాణను, రేపటి భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారు దొరగారు అని మండిపడ్డారు.
కమిషన్ల కోసం కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు ఇవ్వొచ్చని, లిక్కరు ఏరులై పారొచ్చని... కానీ రైతు పండించిన పంటను మాత్రం కొనలేరా? అని షర్మిల ప్రశ్నించారు. బడి పిల్లలకు బువ్వ పెట్టరాదా? కొత్త రేషన్ కార్డులు ఇవ్వకూడదా? ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయ చేతకాదా? అని అన్నారు. పాలన చేతకాక ధర్నాలు మాత్రమే చేస్తున్నారు కేసీఆర్ సారు అని ఎద్దేవా చేశారు.