YSRCP: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీదే హవా.. పాతపట్నంలో ఓడిన ఎమ్మెల్యే కుమారుడు
- 8 జడ్పీటీసీ, 85 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ జయకేతనం
- జనసేన 5, బీజేపీ ఒక స్థానంలో గెలుపు
- అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో వైసీపీకి షాక్
రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 8 స్థానాలను వైసీపీ, 3 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే, 129 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీకి 85, టీడీపీకి 35 దక్కాయి. జనసేన 5, సీపీఎం రెండు, సీపీఐ, బీజేపీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలం జడ్పీటీసీ స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రవణ్ టీడీపీ అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు చేతిలో 59 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కృష్ణా జిల్లా పెడన జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి అర్జా వెంకటనగేశ్ 658 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
అలాగే, గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం జెడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పారా హైమావతి 1,046 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీకి షాక్ తగిలింది. విజయనగరం జిల్లా మక్కువ మండలంలో బీజేపీ విజయం సాధించగా, వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని గుండాలపాడు, వేమవరం ఎంపీటీసీల్లో టీడీపీ విజయం సాధించింది. ఇది రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే ప్రాంతం కావడం గమనార్హం.