Tim Paine: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలకలం.. 'సెక్స్టింగ్’ ఆరోపణల నేపథ్యంలో టెస్టు కెప్టెన్సీకి పైన్ గుడ్‌బై!
- ఆస్ట్రేలియా జట్టు 46వ టెస్టు కెప్టెన్‌గా 2018లో బాధ్యతలు
- నాలుగేళ్ల క్రితం సహోద్యోగితో ‘సెక్స్టింగ్’
- భార్య, కుటుంబ సభ్యుల మద్దతుకు కృతజ్ఞతలు
- యాషెస్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న పైన్
ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలకలం రేగింది. సెక్స్టింగ్ కుంభకోణం (మొబైల్ ఫోన్ ద్వారా అసభ్యకరమైన ఫొటోలు, సందేశాలు పంపడం) ఆరోపణలు ఎదుర్కొంటున్న 36 ఏళ్ల టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ రాజీనామా చేశాడు. హోబర్ట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పైన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. సహోద్యోగికి వరుసగా సెక్స్టింగ్ చేసినందుకు గాను పైన్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా దర్యాప్తు జరిపింది. తన రాజీనామాను గవర్నింగ్ బాడీ ఆమోదించినట్టు టిమ్ పేర్కొన్నాడు. మార్చి 2018లో పైన్ ఆస్ట్రేలియా జట్టు 46వ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ఆస్ట్రేలియా పురుషుల జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని తాను నిర్ణయించుకున్నానని, ఇది చాలా కఠినమైన నిర్ణయమేనని అన్నాడు. అయితే తనకు, తన కుటుంబానికి, క్రికెట్‌కు ఇది సరైన నిర్ణయమేనని చెప్పుకొచ్చాడు. నాలుగేళ్ల క్రితం అప్పటి సహోద్యోగితో సందేశాలను పరస్పరం పంచుకున్నట్టు చెప్పాడు. తాజా నిర్ణయం అందులో భాగమేనన్నాడు. ఈ ఘటనకు సంబంధించి జరుగుతున్న విచారణలో తాను బహిరంగంగానే పాల్గొన్నట్టు చెప్పాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా నియమావళిని ఉల్లంఘించలేదని విచారణలో తేలిందని, తాను నిర్దోషిగా బయటపడినప్పటికీ, ఆ సమయంలో ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసినట్టు చెప్పాడు. ఈ రోజు కూడా అదే పనిచేస్తున్నానన్నాడు. ఈ ప్రైవేట్ టెక్స్ట్ ఎక్స్‌చేంజ్ పబ్లిక్‌గా మారబోతోందని ఇటీవల తెలుసుకున్నట్టు చెప్పాడు. అప్పట్లో తాను తన భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడానని, వారి క్షమాపణ, మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పైన్ వివరించాడు. ఈ ఘటన తమను వేధించినప్పటికీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా చేసినట్టుగానే ఇకపైనా జట్టుపై పూర్తిగా దృష్టి పెడతానని అన్నాడు. ఈ ఘటన తమ ఆట ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు క్షమించాలని వేడుకున్నాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమేనని అనుకుంటున్నానని, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందన్నాడు. యాషెస్ సిరీస్‌కు ముందు జట్టుకు తన నిర్ణయం ఆటంకంగా మారకూడదని భావిస్తున్నట్టు చెప్పాడు. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు నాయకత్వం వహించడం తన క్రీడా జీవితంలోనే గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పాడు. సహచరుల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులో నిబద్ధతతో కూడిన సభ్యుడిగా ఉంటానని, యాషెస్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.