Cricket: కరోనా ఎఫెక్ట్: రెండో టీ20ని వాయిదా వేయాలంటూ పిటిషన్
- ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించిన లాయర్
- 50% నిబంధనలు అమల్లో ఉన్నాయని వెల్లడి
- ఇవాళ రాంచీలో న్యూజిలాండ్ తో రెండో మ్యాచ్
భారత్–న్యూజిలాండ్ మధ్య ఇవాళ జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను వాయిదా వేయాలంటూ ఝార్ఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జైపూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించి 1–0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. రెండో మ్యాచ్ నూ గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. రెండో మ్యాచ్ రాంచీలోని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
అయితే, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఇంకా పోలేదని, ఆఫీసులు, గుళ్లు, కోర్టుల్లో 50 శాతం మందికే అనుమతించేలా నిబంధనలు అమల్లో ఉన్నాయని పేర్కొంటూ.. ధీరజ్ కుమార్ అనే లాయర్ మ్యాచ్ ను వాయిదా వేయాలని పిల్ వేశారు. ఒకవేళ మ్యాచ్ ను నిర్వహించినా కేవలం 50 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించాలని కోరారు.
వాస్తవానికి మొదట 50 శాతం మందితోనే ప్రభుత్వం అనుమతించినా.. ఆ తర్వాత రూల్స్ ను సడలించింది. పూర్తి సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో ధీరజ్ కుమార్ పిల్ వేశారు.