AB De Villiers: క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన ఏబీ డివిలియర్స్

AB De Villiers retires from all forms of cricket

  • దక్షిణాఫ్రికా క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన ఏబీ
  • 2018లోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు
  • తాజాగా ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్
  • మిస్టర్ 360 గా గుర్తింపు పొందిన డివిలియర్స్

దక్షిణాఫ్రికా క్రికెట్లో మేలిమి వజ్రంలా మెరిసిన ఏబీ డివిలియర్స్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు నేడు ప్రకటించాడు. గతంలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఏబీ... తాజా నిర్ణయంతో ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నట్టయింది. మైదానంలో అన్ని మూలలకు బంతిని బాదుతూ మిస్టర్ 360 డిగ్రీస్ గా పేరుగాంచిన ఈ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యోధుడు తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

"నా కెరీర్ ఒక అపూర్వమైన ప్రస్థానం. కానీ ఇప్పుడు నా వయసు 37 సంవత్సరాలు. తప్పుకోక తప్పడంలేదు. మా అన్నలతో కలిసి ఇంటి పెరట్లో క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పటి నుంచి ఆటను మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. హద్దుల్లేని ఉత్సాహంతో ఆటను ఆవాహన చేసుకున్నాను. ఇప్పుడు నా వయసు రీత్యా రిటైర్ మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆడాలన్న కసి నాలో తగ్గిపోయింది" అంటూ వివరించాడు. అంతేకాదు, ఆంగ్లంలోనూ, ఆఫ్రికాన్స్ (ఆఫ్రికా భాష)లోనూ, హిందీలోనూ కృతజ్ఞతలు తెలిపాడు.

డివిలియర్స్ తన కెరీర్లో 114 టెస్టులు ఆడి 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు. వాటిలో 22 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు ఉన్నాయి. 228 వన్డేల్లో 53.50 సగటుతో 9,577 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 53 అర్ధసెంచరీలు ఉన్నాయి. 78 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లలో 135.16 స్ట్రయిక్ రేట్ తో 1,672 పరుగులు సాధించాడు. డివిలియర్స్ తాజా నిర్ణయంతో ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టు అతడి సేవలు కోల్పోనుంది. ఐపీఎల్ లో మొత్తం 180 మ్యాచ్ లు ఆడిన ఏబీ 5,083 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News