Chandrababu: జగన్ భస్మాసురుడిగా మారారు.. నాకు ఏ పదవులూ అవసరం లేదు: చంద్రబాబు
- 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నది అవమానాలు పడటానికా?
- బూతులు తిట్టినా సంయమనం పాటిస్తున్నా
- నా రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుంది
తన జీవితంలో ఇంత ఆవేదనను ఎప్పుడూ అనుభవించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తనను ఎన్ని అవమానాలకు గురి చేసినా, బూతులు తిట్టినా భరించానని... ఈరోజు తన భార్యను కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు నిండు కౌరవసభలో ద్రౌపదికి అవమానం జరిగిందని అన్నారు. ఇప్పుడున్నది కూడా కౌరవసభేనని... గౌరవం లేని సభ అని మండిపడ్డారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గౌరవంగా బతికేవాళ్లను కించపరుస్తున్నారని... 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నది అవమానపడటానికా? అని చంద్రబాబు అన్నారు. తనను బూతులు తిట్టినా సంయమనం పాటిస్తున్నానని... తనకు బూతులు రాకో, తిట్టడం రాకో కాదని చెప్పారు. అది తమ విధానం కాదని చెప్పారు. ప్రజల పాలిట జగన్ భస్మాసురుడిగా మారారని దుయ్యబట్టారు. తనకు పదవులు అవసరం లేదని... తన రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుందని చెప్పారు.