Pawan Kalyan: చంద్రబాబునాయుడు భోరున విలపించడంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
- మీడియా సమావేశంలో కన్నీటిపర్యంతమైన చంద్రబాబు
- అసెంబ్లీలో తన భార్యను దూషించారంటూ ఆవేదన
- దురదృష్టకరమన్న పవన్ కల్యాణ్
- సిగ్గుతో తలదించుకునేలా ఉందని వ్యాఖ్య
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తన భార్యను అసభ్య పదజాలంతో దూషించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున విలిపించారు. దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. తన భార్యను అవమానించారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబునాయుడు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు.
ఓవైపు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తుంటే అవేమీ పట్టని ప్రజాప్రతినిధులు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఇటీవల కాలంలో సభలు, సమావేశాలు, ఆఖరికి టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాల్లో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని పేర్కొన్నారు. తాజాగా శాసనసభలో గౌరవనీయ విపక్ష నేత కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయం అని తెలిపారు.
గతంలో సీఎం జగన్ కుటుంబ సభ్యులను కూడా కొందరు తక్కువచేసి మాట్లాడినప్పుడు తాను ఇలాగే ఖండించానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబు అర్ధాంగిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నానని వివరించారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని హితవు పలికారు. మహిళల గౌరవమర్యాదలకు హాని కలిగించే ధోరణులను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఉద్ఘాటించారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, లేకపోతే ఒక అంటువ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.