Narendra Modi: రెండోసారి ‘మోదీ’ వెనకడుగు.. సాగు చట్టాల రద్దుతో భవిష్యత్ సంస్కరణలకు విఘాతమా?
- గతంలో ఎన్‌జేఏసీ విషయంలో మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
- సంస్కరణలపై మరే ప్రభుత్వాలు మాట్లాడే సాహసం చేయబోవంటున్న నిపుణులు
- వ్యవసాయ రంగ ఉద్ధరణ కోసం ప్రభుత్వం లేని డబ్బు
- క్షమాపణతో మోదీ తనను తాను ‘రీబ్రాండింగ్’ చేసుకున్నారన్న నిపుణులు
కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాది కాలంగా రైతులు చేస్తున్న ఆందోళనకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ వాటిని రద్దు చేస్తున్నట్టు చెప్పడమే కాకుండా రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు.
ఈ క్రమంలో కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు, నిపుణులు, రైతులు ఎవరికి తోచినట్టుగా వారు స్పందించారు. ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. అంతవరకు బాగానే ఉన్నా.. సాగు చట్టాల రద్దు నిర్ణయం భవిష్యత్ ప్రభుత్వాలకు కూడా చేదువార్తేనని నిపుణులు చెబుతున్నారు. సంస్కరణలకు ఇది గొడ్డలిపెట్టు అవుతుందని అంటున్నారు.
కేంద్రం తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం ఇది రెండోసారి. ఇంకా చెప్పాలంటే మోదీ ప్రభుత్వానికి ఇది రెండో ‘ఓటమి’ అని చెబుతున్నారు. గతంలో ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ (ఎన్‌జేఏసీ) విషయంలోనూ మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. న్యాయవ్యవస్థలో సంస్కరణలను తీసుకొచ్చేందుకు 2015లో మోదీ ప్రభుత్వం ఎన్‌జేఏసీని తీసుకొచ్చింది.
అయితే, కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం ‘రాజ్యాంగ విరుద్ధమైనదని’, కాబట్టి అది చెల్లబోదంటూ సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. ఫలితంగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలన్న మోదీ ప్రభుత్వ ప్రయత్నం బెడిసికొట్టింది. అంతేకాదు, భవిష్యత్తులోనూ ఎవరూ ఈ చట్టం గురించి ప్రస్తావించే ప్రయత్నం చేయకపోవచ్చు. అలాగే, మరో 50 ఏళ్లపాటు మరే ప్రభుత్వమూ సాగు చట్టాల ఊసెత్తకపోవచ్చని సుప్రీంకోర్టు నియమిత కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వాట్ చెప్పడం గమనార్హం.
వ్యవసాయ రంగంలో సంస్కరణలను ఆహ్వానిస్తూ గతేడాది నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ సాగు చట్టాలను తీసుకొచ్చింది. నిజానికి అప్పట్లో ఈ మూడు చట్టాలను నిపుణులు మెచ్చుకున్నారు. అయితే, వివాద పరిష్కారానికి సంబంధించి ఒక నిబంధనను మాత్రం వారు వ్యతిరేకించారు. మరోవైపు రైతులు మాత్రం ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మూడు చట్టాలతో వ్యవసాయ రంగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని, ఇది రైతు మెడలో ఉరితాడు అనీ ఆందోళనకు దిగారు.
అలా వ్యవసాయ రంగాన్ని సంస్కరించాలని మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయింది. వ్యవసాయ రంగాన్ని, రైతుల జీవితాలను ఉద్ధరించాలని భావించిన కేంద్రం ఈ విషయంలో విఫలమైంది. దీంతో భవిష్యత్ ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం ఉన్న వ్యవసాయ చట్టాలను ముట్టుకునే సాహసం చేయబోవు.
నిజం చెప్పాలంటే, వ్యవసాయ రంగాన్ని సంస్కరించాల్సి ఉందన్న విషయంపై ఎవరూ వ్యతిరేకంగా వాదించడం లేదు. వేతనాలు లేని ఈ రంగంలో డబ్బు చాలా అవసరం. విత్తనాలు, ఎరువులు, విద్యుత్, వ్యవసాయ పనిముట్లు, పంటల సేకరణ యంత్రాంగం, పంట ఆధారిత కనీస మద్దతు ధర వంటి వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం వద్ద చాలినంత డబ్బు లేదు.
వ్యవసాయ రంగంలో సంస్కరణల లేమి బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ మధ్య ప్రదేశ్ వంటి పేద రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర పెద్ద నగరాలతోపాటు పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి వలసలకు కారణమైంది. నిజానికి చట్టాలను తీసుకొచ్చి ఆ తర్వాత ఆందోళనతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గడం ఇదేమీ కొత్తకాదు. అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒడిశాలోని నియమగిరి కొండల్లో బాక్సైట్ తవ్వకాలకు యూకేకు చెందిన వేదాంత గ్రూప్‌కు అనుమతి నిచ్చింది. అయితే, ఆ తర్వాత రైతుల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం ఆ అనుమతిని వెనక్కి తీసుకుంది.
ఇక, తాజా సాగు చట్టాల విషయానికి వస్తే ఈ సంస్కరణ చట్టాలపై మోదీ వెనకడుగు వేయడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మోదీ నిర్ణయంతో ప్రతిపక్షాలు కూడా షాకయ్యాయి. మోదీ చాలా బలమైన నాయకుడని, ఒకసారి ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయరని పేరుంది. అంతేకాదు, ఏడాదిపాటు ఉద్ధృతంగా సాగిన రైతు ఉద్యమంపై మోదీ ఒక్కసారి కూడా స్పందించలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది చడీచప్పుడు కాకుండా ఉన్నపళంగా చట్టాలను రద్దు చేస్తూ ప్రకటన చేయడంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రం సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు క్షమాపణ చెప్పి మోదీ తనను తాను ‘రీబ్రాండింగ్’ చేసుకున్నారని చెబుతున్నారు. అయితే, మోదీ నిర్ణయం ఏమేరకు ఫలితాలిస్తుందో చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.