Cricket: డివిలియర్స్ రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ స్పందన
- ఏబీ లాగా ప్రభావం చూపే ఆటగాళ్లు కొద్ది మందే
- అతడు ఆడుతుంటే చూడాలనిపిస్తుంది
- హ్యాపీ రిటైర్మెంట్ అంటూ విషెస్
క్రికెట్ నుంచి తానిక వీడ్కోలు తీసుకుంటున్నట్టు నిన్ననే దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ప్రకటించాడు. అన్ని రకాల ఆట నుంచి తప్పుకొంటున్నట్టు వెల్లడించి క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. ఏబీ అనూహ్య నిర్ణయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
అతడి రిటైర్మెంట్ పై టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఆటపై ఏబీ లాగా ప్రభావం చూపే ఆటగాళ్లు అతికొద్ది మంది మాత్రమే ఉంటారని చెప్పుకొచ్చాడు. అతడు ఆడుతుంటే చూడాలనిపిస్తుందని, చాలా ఆనందంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘హ్యాపీ రిటైర్మెంట్ ఏబీ.. నీకు, నీ కుటుంబానికి శుభాభినందనలు’ అంటూ రోహిత్ ట్వీట్ చేశాడు.
కాగా, పొట్టి ఫార్మాట్ లో కొత్త కొత్త షాట్లను నవతరానికి పరిచయం చేసి.. అందరికీ ఏబీ ఆరాధ్యుడయ్యాడు. గ్రౌండ్ మొత్తం షాట్లు కొట్టగల సత్తా అతడి సొంతం. అందుకే అతడిని అభిమానులు ముద్దుగా ‘మిస్టర్ 360’ అని పిలుచుకుంటారు. టెస్ట్ క్రికెట్ లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ ఏబీ పేరుంటుంది. 37 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్ లో బెంగళూరు తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లను ఏబీ ఆడాడు. కానీ, ఈ వయసులో అలాంటి మెరుపులు ఆశించలేమంటూ అతడే ఆటకు గుడ్ బై చెప్పాడు.