Venkaiah Naidu: కనకరాజు వంటి వ్యక్తిని కలవడం ఆనందంగా ఉంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- నాలుగు రోజుల పర్యటన కోసం వైజాగ్ వచ్చిన వెంకయ్య
- ఏయూ ఎదుట మార్నింగ్ వాక్
- కనకరాజు అనే టీ దుకాణం యజమానికి అభినందనలు
- విస్టాడోమ్ రైలుకు ప్రారంభోత్సవం
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం వచ్చారు. నేడు మార్నింగ్ వాక్ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ అవుట్ గేట్ వద్ద టీ దుకాణం నిర్విహించే కనకరాజు అనే వ్యక్తిని కలిశారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు.
టీ దుకాణం నిర్వహించే కనకరాజు ఏడేళ్ల లోపు పిల్లలకు బిస్కెట్లు, పాలు ఉచితంగా అందిస్తుంటాడని, అలాంటి వ్యక్తిని కలవడం ఆనందం కలిగించిందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తున్న ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని వివరించారు. మన కష్టంతో సంపదను పెంచుకోవడమే కాకుండా, మనకు ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడం భారతీయ సంస్కృతిలో భాగమని తెలిపారు. కనకరాజు ఔదార్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
తన విశాఖ పర్యటనలో భాగంగా వెంకయ్యనాయుడు విశాఖపట్నం-కిరండోల్ మధ్య నేడు విస్టాడోమ్ రైలును ప్రారంభించారు. ఈ రైలుకు నూతన ఎల్ హెచ్ బీ సాంకేతికతో తయారైన బోగీలను, గ్లాస్ రూఫ్ తో రూపొందించిన విస్టాడోమ్ బోగీలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా విస్టాడోమ్ బోగీలో ఎక్కిన వెంకయ్యనాయుడు ప్రయాణికులతో మాట్లాడి వారి స్పందన తెలుసుకున్నారు.