Corona Vaccine: పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్... మరో రెండు వారాల్లో కేంద్రం నిర్ణయం
- దేశంలో 100 కోట్ల డోసులు దాటిన వ్యాక్సినేషన్
- త్వరలో సమావేశం కానున్న సలహా సంఘం
- వచ్చే జనవరి నుంచి పిల్లలకు వ్యాక్సిన్లు
- బూస్టర్ డోసులపైనా చర్చించే అవకాశం
- ఇప్పటికే పలు దేశాల్లో అదనంగా మూడో డోసు
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇటీవలే 100 కోట్ల డోసులు పూర్తయ్యాయి. భారత్ కేవలం 9 నెలల వ్యవధిలోనే ఈ ఘనత సాధించింది. అయితే, చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలన్న అంశంపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మరో రెండు వారాల్లో అత్యున్నత స్థాయి సలహా సంఘం సమావేశం కానుంది. చిన్నారులకు వ్యాక్సిన్లు, పెద్దలకు బూస్టర్ డోసు ఇచ్చే అంశాలను ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు 2022 జనవరి నుంచి, చిన్నారులు అందరికీ మార్చి నుంచి వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. ఇక, పలు దేశాల్లో రెండు డోసులు తీసుకున్న వారికి అదనంగా బూస్టర్ డోసు ఇస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.... ఆ దిశగా దృష్టి సారించింది.