Corona Virus: దేశంలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. 543 రోజుల కనిష్ఠానికి!
- దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
- నిన్న 7,579 కేసుల నమోదు
- కేరళలోనే సగం కేసులు.. మరణాలు కూడా అక్కడే ఎక్కువ
- ఇప్పటి వరకు 117 కోట్ల కరోనా డోసుల పంపిణీ
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటితో పోలిస్తే నిన్న కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 7,579 కేసులు నమోదయ్యాయని, ఇది 543 రోజుల కనిష్టమని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 3,698 ఒక్క కేరళలోనే నమోదు కావడం గమనార్హం. అలాగే, నిన్న దేశవ్యాప్తంగా 236 మంది కరోనాతో మరణించారు. వీటిలోనూ 180 మరణాలు కేరళలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరుకోగా, 4,66,147 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్న 12,202 మంది కరోనా నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.39 కోట్లకు పెరిగింది. 1,13,584 కేసులు యాక్టివ్గా ఉన్నట్టు కేంద్రం తాజా బులెటిన్లో వెల్లడించింది. రికవరీల రేటు 98.32 శాతానికి పెరిగిందని పేర్కొంది. అలాగే, నిన్న 71,92,154 మంది టీకాలు వేయించుకున్నారని, వీరితో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 117 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.