Anand Mahindra: ఎవరు వీళ్లంతా?.. చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆనంద్ మహీంద్ర వార్నింగ్
- ఆనంద్ మహీంద్ర పేరిట తప్పుడు కోట్
- తన మీద ఇంటర్నెట్ లో వేట కొనసాగుతోందని కామెంట్
- ఆ మాటలు తాను అనలేదని వివరణ
తాను అనని మాటలను అన్నట్టు పుట్టిస్తుండడంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తే లీగల్ యాక్షన్ కూ వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ లో నీ మీద వేట మొదలైందంటూ ఓ సహచరుడు చెప్పారని, అందుకు ఈ తప్పుడు కోట్ నిదర్శనమని ఆనంద్ మహీంద్ర చెప్పారు. తాను అనని మాటలను తప్పుగా తనకు అన్వయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇకపై ఎవరైనా తనపై తప్పుడు పోస్టులు పెడితే ఓ రెండు మీమ్స్ పోస్ట్ చేస్తానని ఆయన చెప్పారు. ‘ఎవరు వీళ్లంతా? ఎక్కడి నుంచి వస్తారు?’ అనే ఓ మీమ్ ను పోస్ట్ చేశారు.
దాంతో పాటు స్టార్టప్ ఫౌండర్ పేరిట తనపై వచ్చిన ఫేక్ న్యూస్ ను ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఓ సగటు భారతీయ పురుషుడు సోషల్ మీడియాలో మహిళలను అనుసరిస్తూ తన కాలాన్ని గడిపేస్తాడు. స్పోర్ట్స్ జట్లపై తన ఆశలను పెట్టుకుంటాడు. తన గురించి పట్టించుకోని రాజకీయ నాయకుడి చేతిలో తన కలలన్నీ పెడతాడు’’ అని పేర్కొంటూ మహీంద్ర ఫొటో కింద ఓ కోట్ ను స్టార్టప్ ఫౌండర్ అనే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది ఫేక్ అని పేర్కొంటూ ఆనంద్ మహీంద్రా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.