Parliament: ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
- మరికొన్ని రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు
- ప్రకటన చేసిన లోక్ సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు
- డిసెంబరు 23 వరకు సమావేశాలు!
- పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాలు డిసెంబరు 23 వరకు జరగనున్నట్టు తెలుస్తోంది. శీతాకాల సమావేశాలపై లోక్ సభ, రాజ్యసభ సెక్రటేరియట్ లు నేడు ఓ ప్రకటన చేశాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా క్రిప్టో కరెన్సీ బిల్లుతో పాటు 26 బిల్లులు ప్రవేశపెట్టి, చర్చించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లోనే మూడు కీలక ఆర్డినెన్స్ లు కూడా తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.
క్రిప్టో కరెన్సీ అంశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. దీనితోపాటే బ్యాంకింగ్ సవరణ బిల్లు, వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, ఐబీసీ సవరణ బిల్లు, పలు ఇతర బిల్లులు చర్చకు రానున్నాయి. ఇటీవల క్రిప్టోకరెన్సీ అంశంపై తొలిసారిగా పార్లమెంటరీ సంఘం సమావేశమైంది. క్రిప్టోకరెన్సీని అడ్డుకోలేమని, అయితే నియంత్రించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. అంతకుముందు ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతోనూ, ఆర్బీఐ వర్గాలతోనూ సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలోనే క్రిప్టోకరెన్సీ బిల్లుకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇక దేశవ్యాప్తంగా రైతులు కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తున్నట్టు కేంద్రం వెల్లడించగా... పార్లమెంటులో అధికారికంగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.