PV Sindhu: మరోసారి ఎన్నికల బరిలో పీవీ సింధు
- బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ కు రెండోసారి పోటీ
- వచ్చేనెల 17న స్పెయిన్ లో ఎన్నికల నిర్వహణ
- ఆరు మహిళా స్థానాలకు 9 మంది పోటీ
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఎన్నికల బరిలో నిలబడనుంది. అయితే, అవి రాజకీయ ఎన్నికలు కాదు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. డిసెంబర్ 17న జరగనున్న ఎన్నికల్లో.. ఆరు మహిళా స్థానాల కోసం మొత్తం 9 మంది పోటీ పడుతున్నారు. స్పెయిన్ లో నిర్వహించే వరల్డ్ చాంపియన్ షిప్ తో పాటు నిర్వహించే ఎన్నికల్లో ఆమె రెండోసారి బరిలో నిలవనుంది.
ఈ అథ్లెట్స్ కమిషన్ 2021 నుంచి 2025 వరకు అమల్లో ఉంటుంది. రీ ఎలక్షన్ కోసం పోటీ పడుతున్న ఏకైక క్రీడాకారిణి పీవీ సింధూనేనని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. అంతకుముందు 2017లో పీవీ సింధు తొలిసారి అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికైంది. సింధుతో పాటు ఇండోనేషియా విమెన్స్ డబుల్స్ ప్లేయర్ గ్రేషియా పొలీలి కూడా పోటీలో ఉంది.