Perni Nani: సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని
- అసెంబ్లీలో మాట్లాడిన పేర్ని నాని
- ఆన్ లైన్ లో సినిమా టికెట్లు కొనుక్కోవచ్చని వెల్లడి
- ధరలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటాయన్న మంత్రి
- నిర్దేశించిన మేరకే షోలు ప్రదర్శించాలని స్పష్టీకరణ
నేటి ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సవరణ బిల్లు తీరుతెన్నులను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకే షోలు ప్రదర్శించాల్సి ఉంటుందని, టికెట్ల ధరలు కూడా ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు.
మొబైల్ ఫోన్ తో బస్సు, రైలు, విమాన టికెట్లు బుక్ చేసుకున్నంత సులువుగా సినిమా టికెట్లు బుక్ చేసుకుని దర్జాగా సినిమా థియేటర్ కు వెళ్లే సానుకూల పరిస్థితులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ స్వాగతించారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని 1,100 థియేటర్లు ఆన్ లైన్ పరిధిలోకి రానున్నాయని వివరించారు.
ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో మార్పు తీసుకువస్తామని అన్నారు. రోజుకు 4 షోలు వేయాల్సిన చోట ఇష్టం వచ్చినట్టుగా ఆరు, ఏడు షోలు వేసుకుంటున్నారని ఆరోపించారు. బెనిఫిట్ షోల సమయంలో మరీ దారుణంగా ఒక్కో టికెట్ రూ.1500 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు.
సినిమాటోగ్రఫీ చట్టాన్ని కూడా లెక్కచేయని పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. చట్టం తమను ఏమీ చేయలేదని కొందరు భావిస్తుంటే, మరికొందరు తమకు అనుకూలంగా చట్టం ఉండాలని కోరుకుంటున్నారని వివరించారు. టికెట్లు అయిపోయాయని చెప్పి బ్లాక్ లో వేల రూపాయలకు టికెట్లు అమ్ముతూ ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సినీ వినోదం అందరికీ అందుబాటులో ఉండాలే తప్ప, ప్రజల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకునేలా ఉండరాదని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. చట్ట విరుద్ధంగా ఇష్టం వచ్చినన్ని షోలు వేసుకుంటూ ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు.
ఇకపై ఈ పరిస్థితి ఉండదని, ప్రభుత్వ పోర్టల్ ద్వారా పారదర్శకంగా ఉండే విధానం తీసుకువస్తున్నామని వెల్లడించారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమల్లోకి వస్తుందని, తద్వారా అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.