Pakistan: దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. బయట పెట్టేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్
- ప్రభుత్వాన్ని నడిపించేందుకు అవసరమైన డబ్బు లేదు
- అందుకనే విపరీతంగా అప్పులు చేయాల్సి వస్తోంది
- గత నాలుగు నెలల్లో ఏకంగా 3.8 బిలియన్ డాలర్ల అప్పు
- పన్నులు చెల్లించాలంటూ ప్రజలకు వేడుకోలు
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెబుతూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూలో ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ మాట్లాడుతూ.. దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన డబ్బులు ప్రభుత్వం వద్ద లేవని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం దేశం ముందున్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొన్నారు.
ఓ వైపు అప్పులు పెరిగిపోతుండగా, మరోవైపు పన్నులు కూడా సకాలంలో వసూలు కావడం లేదన్నారు. గత ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఆర్థిక వనరులు తగినంతగా లేకపోవడం వల్ల ప్రజా సంక్షేమానికి బడ్జెట్ కేటాయించలేకపోతున్నామని ఇమ్రాన్ తెలిపారు. గత నాలుగు నెలల్లో ప్రభుత్వం ఏకంగా 3.8 బిలియన్ డాలర్ల అప్పు చేసిందని, వీటి నుంచి బయటపడాలంటే ప్రజలు పన్నులు చెల్లించాలని ఇమ్రాన్ కోరారు.