Karnataka: ఇంటి పైపుల్లో నోట్ల కట్టలు.. బంగారు ఆభరణాలు: ఏసీబీ సోదాల్లో వెలుగులోకి.. వీడియో చూడండి!
- కర్ణాటకలో ఏక కాలంలో 60 చోట్ల తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు
- కలబురిగిలో ఇంజినీరు ఇంట్లోంచి రూ. 40 లక్షల నగదు, బంగారం స్వాధీనం
- గదగ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ నివాసం నుంచి 7 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం
కర్ణాటకలోని ఓ అధికారి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు నివ్వెరపోయారు. ఇంటి పైపుల్లోంచి తీసిన కొద్దీ నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు బయటపట్డాయి. రాష్ట్రంలోని పలువురు అధికారుల ఇళ్లపై నిన్న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలబురిగి గుబ్బికాలనీలోని ప్రజాపనుల శాఖ ఇంజినీరు శాంతగౌడర నివాసంలో తనిఖీలు జరిగాయి. భవనానికి ఏర్పాటు చేసిన పైపుల్లో తనిఖీ చేయగా నోట్ల కట్టలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. తీసేకొద్దీ నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు వస్తుండడంతో అధికారులు విస్తుపోయారు. అలా మొత్తంగా రూ. 40 లక్షల నగదు, ఆభరణాలు బయటపడగా, అధికారులు వాటిని జప్తు చేశారు.
నిన్న మొత్తం 15 మంది అధికారుల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో 60 చోట్ల దాడులు చేశారు. గదగ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టి.ఎస్. రుద్దేశప్ప నివాసంలో 7 కిలోల బంగారు బిస్కెట్లు, రూ. 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.