Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితతో పాటు 16 మందిపై కేసులు నమోదు
- చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యలను నిరసిస్తూ పాదయాత్ర
- అడ్డుకున్న నర్సీపట్నం పోలీసులు
- విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు
చంద్రబాబు కుటుంబం గురించి అసెంబ్లీలో వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, చింతలపూడి విజయ్ లు నిన్న ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వీరితో పాటు 16 మందిపై కేసులు నమోదు చేసినట్టు నర్సీపట్నం పోలీసులు తెలిపారు. విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కింద వీరిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని తెలిపారు.
మరోవైపు అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అనుమతి తీసుకునే ర్యాలీ చేపట్టామని చెప్పారు. తన నివాసం నుంచి పాదయాత్రను ప్రారంభించామని... మధ్యలోకి వచ్చిన తర్వాత తమను ఆపాల్సిన అవసరం పోలీసులకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ నేతల కుట్రలకు అనుగుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.