Kasab: కసబ్ ఫోన్ ను ధ్వంసం చేసిన పరంబీర్ ను అరెస్ట్ చేయాలి: మాజీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంషేర్ ఖాన్
- 13 ఏళ్ల క్రితం ముంబైలో మారణహోమాన్ని సృష్టించిన ఉద్యోగులు
- ఆ సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డీఐజీగా ఉన్న పరంబీర్
- ఫోన్ ను దర్యాప్తు అధికారికి ఇవ్వని పరంబీర్
ఇప్పటికే బలవంతపు వసూళ్లకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్న ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ కు మరిన్ని సమస్యలు వచ్చిపడేలా ఉన్నాయి. ముంబై నగరంలో 13 ఏళ్ల క్రితం పాకిస్థాన్ ఉగ్రవాదులు మారణహోమాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా టెర్రరిస్ట్ కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ను పరంబీర్ సింగ్ ధ్వంసం చేశారంటూ మాజీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంషేర్ ఖాన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంషేర్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదులో ఏముందంటే... కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ను అప్పటి ఇన్స్ పెక్టర్ ఎస్ఆర్ మాలి... కాంబ్లీ అనే కానిస్టేబుల్ కు ఇచ్చారు... ఆయన నుంచి పరంబీర్ సింగ్ దాన్ని తీసుకున్నారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డీఐజీగా పరంబీర్ ఉన్నారు. అయితే ఆ ఫోన్ ను అప్పటి దర్యాప్తు అధికారి రమేశ్ మహాలేకు ఇవ్వకుండా పరంబీర్ దాన్ని ధ్వంసం చేశారు.
ఈ ఫిర్యాదును ఆయన ఈ ఏడాది జులైలో చేశారు. అయితే నిన్న ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో సంషేర్ మాట్లాడుతూ, ఉగ్రదాడికి సంబంధించిన కీలక సాక్ష్యం మొబైల్ ఫోన్ అని... దాన్ని ధ్వంసం చేసిన పరంబీర్ ను అరెస్ట్ చేయాలని అన్నారు. ఈ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని ఆయన ఉగ్ర సంస్థలకు విక్రయించి ఉండొచ్చని... లేదా బలవంతపు వసూళ్ల కోసమైనా ఉపయోగించుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.