Rains: దక్షిణ కోస్తా, రాయలసీమకు తాజా వాతావరణ హెచ్చరికలు
- కొమరిన్ ప్రాంతం మీదుగా ఉపరితల ఆవర్తనం
- తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరి ప్రాంతాలకు భారీ వర్ష సూచన
- గంటకు 60 కిమీ వేగంతో గాలులు
- మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్న ఐఎండీ
బంగాళాఖాతంలో కొమరిన్ ప్రాంతం, శ్రీలంక తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నెల 26 నుంచి 29 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ, యానాంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది.
కేరళలోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. అదే సమయంలో కొమరిన్ ప్రాంతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, దక్షిణ తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.
కాగా, ఈ నెల 29న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది తదుపరి 48 గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని పేర్కొంది.