Chiranjeevi: శివశంకర్ మాస్టర్ కుటుంబానికి చిరంజీవి రూ.3 లక్షల ఆర్థికసాయం

Chiranjeevi donates three lakh rupees for Shivshankar Master family
  • శివశంకర్ మాస్టర్ కు కరోనా
  • ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమం
  • పెద్దమనసుతో స్పందించిన చిరంజీవి
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారినపడి హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శివశంకర్ మాస్టర్ చికిత్స నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి ఉదారంగా స్పందించారు. రూ.3 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. శివశంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ శివశంకర్ కు చెక్ ను అందజేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఇటీవలే శివశంకర్ మాస్టర్ ఆచార్య సెట్స్ వద్దకు వచ్చారని, ఆయనతో మాట్లాడానని వెల్లడించారు. ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని, దేవుడు తప్పకుండా ఆయన కోలుకునేలా చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

శివశంకర్ మాస్టర్ తనయుడు అజయ్ స్పందిస్తూ, చిరంజీవికి పాదాభివందనం చేశారు. ఈ కష్టసమయంలో చిరంజీవి అందిస్తున్న సాయాన్ని మర్చిపోలేమని అన్నారు. చిరంజీవికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పారు. చిరంజీవితో తన తండ్రి ఎన్నో సినిమాలు చేశారని, ఆయనంటే తన తండ్రికి ఎంతో ఇష్టమని వెల్లడించారు.

కాగా, శివశంకర్ పెద్ద కుమారుడు కూడా కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అటు, శివశంకర్ మాస్టర్ అర్ధాంగికి కూడా కరోనా పాజిటివ్ రాగా, ఆమె హోం క్వారంటైన్ లో ఉన్నారు. ప్రస్తుతం తండ్రి, సోదరుడి చికిత్స బాధ్యతలను అజయ్ ఒక్కడే చూసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ కుటుంబానికి తమిళ హీరో ధనుష్ కూడా రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే.
Chiranjeevi
Shivshankar Master
Donation
Corona
AIG Hospital
Hyderabad
Tollywood

More Telugu News