Niti Aayog: దేశంలో అత్యంత పేద రాష్ట్రాలు ఇవే!
- నీతి ఆయోగ్ తాజా సూచిక
- దారిద్ర్యంలో బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్
- ఈ మూడు రాష్ట్రాల్లో పేదలు ఎక్కువన్న నీతి ఆయోగ్
- కేరళలో అత్యంత తక్కువస్థాయిలో పేదరికం
నీతి ఆయోగ్ తాజాగా దారిద్ర్య సూచిక నివేదికను విడుదల చేసింది. దేశంలోకెల్లా అత్యంత పేద రాష్ట్రాలుగా బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లను పేర్కొంది. నీతి ఆయోగ్ భిన్న దృక్కోణాల్లో అధ్యయనం చేసి ఈ సూచిక తయారుచేసింది.
దీని ప్రకారం.... బీహార్ జనాభాలో 51.91 శాతం మంది పేదవారేనని వెల్లడించింది. ఆ తర్వాత స్థానంలో ఉన్న ఝార్ఖండ్ లో 41.16 శాతం మంది ప్రజలు పేదరికంతో మగ్గుతున్నారని, ఉత్తర్ ప్రదేశ్ లో 37.79 శాతం మంది దారిద్ర్యంలో ఉన్నారని వివరించింది. ఆ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్ (36.65 శాతం), మేఘాలయా (32.67 శాతం) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
ఈ పట్టికలో తక్కువ దారిద్ర్య రేటు కలిగివున్న రాష్ట్రాలుగా కేరళ (0.71 శాతం), గోవా (3.76 శాతం), సిక్కిం (3.82 శాతం), తమిళనాడు (4.89 శాతం), పంజాబ్ (5.59 శాతం)లను నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. విద్య, ఆరోగ్యం, పోషణ, జీవన ప్రమాణాలు వంటి 12 అంశాల ప్రాతిపదికగా నీతి ఆయోగ్ ఈ సూచికను రూపొందించింది.
ఈ జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో, ఏపీ 20వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో పేదల శాతం 13.74 అని, ఏపీ జనాభాలో పేదల శాతం 12.31 అని నీతి ఆయోగ్ పేర్కొంది.