Team New Zealand: కాన్పూరు టెస్ట్: లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ స్కోరు 197/2
- జోరుగా ఆడుతున్న టామ్ లాథమ్
- ఉమేశ్‌కు వికెట్ల ముందు దొరికిపోయిన విలియమ్సన్
- భారత్‌కు దీటుగా బదులిస్తున్న కివీస్
కాన్పూరులో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 148 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు ఈ ఉదయం ఓవర్ నైట్ స్కోరు 129/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఏమాత్రం తడబడకుండా ఆడింది. నిన్నటి జోరునే కొనసాగించింది. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్ ఓపెనర్లను ఎట్టకేలకు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విడదీశాడు.
అశ్విన్ వేసిన 67వ ఓవర్ తొలి బంతికి కీపర్‌కు చిక్కిన విల్ యంగ్ (89) తన ఇన్నింగ్స్‌ను ముగించడంతో 151 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు క్రీజులో పాతకుపోయిన టామ్ లాథమ్ (82) మాత్రం అదే జోరు కొనసాగిస్తూ స్కోరు బోర్డుపై పరుగులు జోడిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి అండగా నిలిచిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 18 పరుగులు మాత్రమే చేసి ఉమేశ్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం 197 పరుగులు చేసిన కివీస్ భారత్ కంటే 148 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేసింది.