Tirupati: వరదలు తగ్గిన తర్వాత తిరుపతి ప్రజలకు కొత్త సమస్యలు!
- తిరుపతిలో వరద బీభత్సం
- రోజుల తరబడి నీళ్లలో నానిన ఇళ్లు
- భూమిలోంచి పైకిలేచిన ట్యాంకు
- పలు ఇళ్లకు బీటలు
తిరుపతిలో ఇటీవల భారీ వర్షాలు కురియడంతో వరదలు సంభవించాయి. అనేక కాలనీలు రోజుల తరబడి నీట మునిగాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ప్రజలకు కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓ ఇంటివద్ద నీటి ట్యాంకు భూమి లోపలి నుంచి కొన్ని అడుగుల మేర ఒక్కసారిగా పైకి లేవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎందుకిలా జరిగిందో అర్థంకాక ప్రజలు హడలిపోతున్నారు.
తాజాగా తిరుపతి శ్రీకృష్ణ నగర్ లో 18 ఇళ్లు బీటలు వారాయి. దాంతో ప్రజలు ఆ ఇళ్ల నుంచి బయటికి వచ్చేశారు. ఆ ఇళ్లు కొద్దిమేర కుంగిపోయాయని కూడా స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఈ ఘటనలపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం భూగర్భ శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ మధు వివరణ ఇచ్చారు. ఈ నిర్మాణాలు ఓ కాలువపై నిర్మించినట్టు తెలిసిందని, భూగర్భ పొరల్లో ఇసుక ఉన్నందున, వరద ప్రభావంతో భూగర్భ నీటి మట్టం పెరిగి ట్యాంకు పైకి లేచి ఉంటుందని వివరించారు.