Axar Patel: అక్షర్ పటేల్ కు 5 వికెట్లు... న్యూజిలాండ్ 296 ఆలౌట్
- కాన్పూర్ లో తొలి టెస్టు
- టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
- టీమిండియాకు కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
- రెండో ఇన్నింగ్స్ లో ఆదిలోనే ఓపెనర్ గిల్ అవుట్
కాన్పూర్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు 1, అశ్విన్ కు 3 వికెట్లు లభించాయి. పేసర్ ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది. టెస్టుల్లో 5 వికెట్లు తీయడం అక్షర్ కు ఇది ఐదోసారి.
అంతకుముందు 129 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట షురూ చేసి కివీస్.... 151 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయారు. 89 పరుగులు చేసిన ఓపెనర్ విల్ యంగ్ అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అక్కడ్నించి న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. నిన్నటి ఆటలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన టీమిండియా స్పిన్నర్లు... నేడు రెండో సెషన్ లో చెలరేగిపోయారు. అక్షర్ పటేల్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో కివీస్ తడబడ్డారు.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ 18, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 11, కైల్ జేమీసన్ 23 పరుగులు చేశారు. భారత సంతతి కుర్రాడు రచిన్ రవీంద్ర (13)ను రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు. కాగా, భారత్ కు 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి ఆదిలోనే ఓపెనర్ శుభ్ మాన్ గిల్ వికెట్ కోల్పోయింది. ఒక పరుగు చేసిన గిల్... జేమీసన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. క్రీజులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా ఉన్నారు.