Andhra Pradesh: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు అల్పపీడనం
- ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు
- మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
- రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపటి వరకు వర్షాలు ఇలాగే కురుస్తాయని పేర్కొన్న వాతావరణశాఖ అధికారులు.. దక్షిణ అండమాన్ తీరంలో రేపు (సోమవారం) ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు అక్కడక్కడగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో తీరం వెండి 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.