Omicron: దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్ వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ పాజిటివ్

Thirteen tested Omicron positive in Amsterdam who arrived from South Africa

  • డేంజరస్ వేరియంట్ గా ఒమిక్రాన్
  • మొదటగా దక్షిణాఫ్రికాలో వెల్లడైన బి.1.1.529
  • స్వల్ప వ్యవధిలోనే అనేక దేశాలకు విస్తరణ
  • ప్రయాణ ఆంక్షలు విధించిన పలు దేశాలు

ప్రమాదకర కరోనా వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ క్రమంగా విస్తృతమవుతోంది. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. నేడు దక్షిణాఫ్రికా నుంచి రెండు విమానాల్లో 61 మంది ప్రయాణికులు ఆమ్ స్టర్ డామ్ చేరుకున్నారు. వారికి ఎయిర్ పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహించారు.

శాస్త్రీయంగా బి.1.1.529గా పరిగణించబడే ఒమిక్రాన్ వేరియంట్ తొలుత దక్షిణాఫ్రికాలో వెల్లడైంది. కొద్దిసమయంలోనే ఇది అనేక దేశాలకు పాకడంతో ఈ కొత్త వేరియంట్ ను తేలిగ్గా తీసుకోరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇతర దేశాలను అప్రమత్తం చేసింది.

కాగా, ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 115కి చేరింది. ఒక్క దక్షిణాఫ్రికాలోనే 99 కేసులు గుర్తించారు. తాజాగా బ్రిటన్ లో 2 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. అటు, ఆస్ట్రేలియాలోనూ 2 కేసులు వెల్లడయ్యాయి. బోట్సువానాలో 6, హాంకాంగ్ లో 2, ఇటలీలో 1, ఇజ్రాయెల్ లో 1, బెల్జియంలో 1, చెక్ రిపబ్లిక్ లో 1 కేసు నమోదయ్యాయి.

కొత్త రకం కరోనా నేపథ్యంలో బ్రిటన్ సహా పలు యూరప్ దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా ఆంక్షలు కఠినతరం చేశాయి. అనేక దేశాలు అంతర్జాతీయ విమానాలను నిషేధించగా, ఇజ్రాయెల్ ముందు జాగ్రత్తగా సరిహద్దులు మూసేసింది. ఆసియాలో పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లోనూ ఆంక్షలు విధించారు.

భారత్ లో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులేవీ నమోదు కాకపోయినా, అంతర్జాతీయ ప్రయాణికులపై నిశితంగా దృష్టి పెట్టాలని, కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News