Rains: తమిళనాడుపై వరుణుడి పంజా... విద్యాసంస్థలకు సెలవు
- తమిళనాడులో భారీ వర్షాలు
- రేపు కూడా విస్తారంగా వర్షాలు పడతాయన్న ఐఎండీ
- చెన్నై, ఏడు జిల్లాల్లో అప్రమత్తం
- 50 వేల హెక్టార్లలో పంట నష్టం
- రుతుపవనాల సీజన్ లో 68 శాతం అధిక వర్షపాతం
తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో రామనాథపురం, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది. ఇతర జిల్లాలోనూ విస్తారంగా వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏడు జిల్లాల్లోనూ, చెన్నైలోనూ స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ప్రకటించారు.
ఇవాళ చెన్నైలో 6.5 మిమీ వర్షపాతం నమోదు కాగా, కన్నియాకుమారిలో 4, నాగపట్నంలో 17, తూత్తుకుడిలో 0.5, తిరుచెండూరులో11, కొడైకెనాల్ లో 15 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక, కడలూరులో 7 మిమీ, పుదుచ్చేరిలో 6.6 మిమీ వర్షం పడింది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 50 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగింది. తమిళనాడులో రుతుపవనాల సీజన్ లో ఈసారి సాధారణ వర్షపాతం కంటే 68 శాతం అధికంగా నమోదైంది.