WHO: ఒమిక్రాన్ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ ఏంచెబుతోందంటే...!
- మానవాళికి మరో ముప్పులా ఒమిక్రాన్
- దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్
- బి.1.1.529గా శాస్త్రీయ నామకరణం
- వేగంగా విస్తరిస్తున్న కొత్త రకం కరోనా
ఒమిక్రాన్... ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొత్త కరోనా వేరియంట్. సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచి క్రమంగా కోలుకుంటున్న ప్రపంచ దేశాలు ఇప్పుడీ కొత్త ముప్పు నుంచి తప్పించుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు వెలుగుచూసిన కరోనా వేరియంట్లలో డెల్టా రకం కరోనా ప్రమాదకరం అనుకుంటే, ఒమిక్రాన్ దాన్ని మించిందిలా కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రాథమికంగా అంచనా వేసింది.
దక్షిణాఫ్రికాలో ఈ నెల 9న ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలు పరిశీలించగా, ఇప్పటివరకు తెలియని కొత్త వేరియంట్ తొలిసారిగా ఉనికిని చాటుకుంది. దానిపై పరిశోధనల అనంతరం టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఈ నయా వేరియంట్ ను బి.1.1.529గా నిర్ధారించింది. ఈ వేరియంట్ ను పరిశీలించిన శాస్త్రవేత్తలకు దానిలోని స్పైక్ ప్రొటీన్ అసాధారణంగా కనిపించింది. ఏకంగా 32 మ్యుటేషన్లతో దర్శనమిచ్చింది. దాంట్లోని పలు ఉత్పరివర్తనాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయని తెలుసుకున్నారు. ముఖ్యంగా, ఒకసారి కరోనా బారినపడిన వ్యక్తికి కూడా ఈ వేరియంట్ సులభంగా సోకుతుంది.
పరిశోధకులను, వైద్య నిపుణులను ఈ ఒమిక్రాన్ వేరియంట్ కొన్ని అంశాల్లో విపరీతమైన ఆందోళనకు గురిచేస్తోంది. ఇది వేగంగా వ్యాప్తి చెందడమే కాదు, తీవ్ర వ్యాధి లక్షణాలు కలిగించడం, వ్యాధి నిరోధక శక్తి దాడుల నుంచి తప్పించుకునే నేర్పరితనం కలిగివుండడం, అసలు కరోనా పరీక్షలకు కూడా దొరకని జిత్తులమారితనం, చికిత్సకు లొంగని వైనం... ఇలా అనేక అంశాల్లో ఒమిక్రాన్ మానవాళికి సవాల్ విసిరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ (జన్యు పరిణామక్రమం)పై పరిశోధనలు జరుగుతున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు దీన్ని ఏమేరకు అడ్డుకోగలవన్న అంశంపైనా పరిశోధకులు దృష్టి సారించారు. ప్రధానంగా వ్యాక్సిన్లు మానవుల్లో యాంటీబాడీలను వృద్ధి చేస్తాయి. వ్యాక్సిన్లతో ఏర్పడిన యాంటీబాడీలు ఒమిక్రాన్ వేరియంట్ ను నిలువరించగలవా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ కొత్త రకం కరోనాలో అధిక సంఖ్యలో మ్యుటేషన్లు ఉండడమే అందుకు కారణం.