Team India: వర్ణ వివక్షకు గురయ్యా.. టీమిండియా మాజీ లెగ్‌స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు
- కెరియర్ మొత్తం వివక్ష ఎదుర్కొన్నా
- స్వదేశంలోనూ వివక్ష బాధించింది
- గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసిన అభినవ్ ముకుంద్, దొడ్డ గణేశ్
టీమిండియా మాజీ లెగ్‌స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెరియర్ మొత్తం తాను వర్ణ వివక్షకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. కెరియర్లో చాలాసార్లు వర్ణవివక్షకు గురయ్యానని, శరీర రంగు గురించి విమర్శలు ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. స్వదేశంలోనూ వివక్షకు గురికావడం తనను తీవ్రంగా బాధించిందంటూ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో జాతి వివక్షపై దుమారం రేపుతున్న తరుణంలో శివరామకృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలో తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. 15 ఏళ్ల వయసు నుంచే విదేశాలకు వెళ్తున్నానని, తన రంగు గురించి కొందరు మాట్లాడుకోవడం, వ్యాఖ్యలు చేయడం ఏంటో తనకు అర్థమయ్యేది కాదని అన్నాడు. నిజానికి క్రికెట్ గురించి తెలిసిన వారికి ఆటగాళ్ల రంగు గురించి అవగాహన ఉంటుందని అన్నారు. తాము ఎండలో సాధన చేస్తామని, ఎండలోనే ఆడతామని, కాబట్టి రంగుల్లో తేడాలు రావడం సహజమేనని అప్పట్లో ముకుంద్ పేర్కొన్నాడు. కర్ణాటక మాజీ పేసర్ దొడ్డ గణేశ్ కూడా గతేడాది ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.