Sangareddy District: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 42 మంది విద్యార్థులు, టీచర్ కు పాజిటివ్
- సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలపై కరోనా పంజా
- పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది
- గురుకులంలోనే క్వారంటైన్ లో ఉన్న బాధితులు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ఏకంగా 43 మంది విద్యార్థులతో పాటు ఒక టీచర్ కరోనా బారిన పడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులతో పాటు 27 మంది సిబ్బంది ఉన్నారు.
మూడు రోజుల క్రితం ఓ విద్యార్థి అస్వస్థతకు గురి కాగా... వైద్య పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ టెస్టులో సదరు విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నిన్న 261 మంది విద్యార్థులు, 43 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 44 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనా బారిన పడిన వారిని గురుకులంలోనే క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మిగిలిన విద్యార్థులు, సిబ్బందికి ఈరోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు.