AP Governor: ఏపీ గవర్నర్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల
- ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న గవర్నర్
- కరోనా అనంతర లక్షణాలతో బాధపడుతున్న వైనం
- మరోసారి హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిక
- ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
ఇటీవల కరోనా బారినపడిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రస్తుతం కరోనా తదనంతర లక్షణాలతో బాధపడుతున్నారు. దాంతో ఆయనను మరోసారి హైదరాబాదు ఏఐజీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వర్గాలు తాజా బులెటిన్ విడుదల చేశాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. తమ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని బులెటిన్ లో తెలిపారు. గవర్నర్ శరీరంలోని కీలక వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని వివరించారు. సాఫీగా శ్వాస తీసుకుంటున్నాడని పేర్కొన్నారు.
కొన్నిరోజుల క్రితం గవర్నర్ హరిచందన్ దంపతులకు కరోనా సోకడంతో వారిని ప్రత్యేక విమానంలో హైదరాబాదు తరలించారు. నవంబరు 17న ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వారికి చికిత్స అందించారు. ఆపై కరోనా నెగెటివ్ రాగా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో వారిని ఈ నెల 23న డిశ్చార్జి చేశారు.
అయితే స్వల్ప స్థాయిలో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడంతో ఆయనను మరోసారి హైదరాబాద్ తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా అనంతరం సాధారణంగా కనిపించే స్వల్ప డయేరియా, రక్తహీనత, వాపు తదితర అంశాలను గుర్తించారు.