VVS Laxman: ఈ న్యూజిలాండ్ ఆటగాడికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంది: వీవీఎస్ లక్ష్మణ్
- డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్టు
- ఓటమి నుంచి తప్పించుకున్న కివీస్
- అద్భుత పోరాటం చేసిన రచిన్ రవీంద్ర
- 91 బంతుల్లో 18 నాటౌట్
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య కాన్పూర్ లో జరిగిన టెస్టు మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయానికి రెండు అంశాలు అడ్డుపడ్డాయి. ఒకటి వెలుతురు లేమి అయితే, రెండోది న్యూజిలాండ్ కొత్త ఆటగాడు రచిన్ రవీంద్ర. 22 ఏళ్ల రచిన్ రవీంద్రకు ఇదే తొలి టెస్టు మ్యాచ్. అయితేనేం భారత స్పిన్ దాడులను ఎదుర్కొని న్యూజిలాండ్ ను ఓటమి నుంచి తప్పించాడు.
ఒక్క వికెట్ తీస్తే గెలుపు వశమవుతుందన్న తరుణంలో టీమిండియాకు కొరకరానికొయ్యలా మారాడు. రెండో ఇన్నింగ్స్ లో ఈ భారత సంతతి ఆటగాడు 91 బంతులు ఎదుర్కొని 18 పరుగులే చేసినా, పరిస్థితుల దృష్ట్యా అది సెంచరీతో సమానం. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు.
కివీస్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రపై ప్రశంసల జల్లు కురిపించాడు. నేడు న్యూజిలాండ్ కాన్పూర్ టెస్టును డ్రా చేసుకుందంటే ఆ ఘనత రచిన్ రవీంద్రకే దక్కుతుందని అని అన్నాడు. ఎంతో క్లిష్టపరిస్థితుల్లో అతడు ప్రదర్శించిన నిబ్బరం, ప్రశాంత స్వభావం కివీస్ ను గట్టెక్కించాయని పేర్కొన్నాడు. ఈ కుర్రాడికి తప్పకుండా ఉజ్వలమైన భవిష్యత్ ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.
ఏదేమైనా న్యూజిలాండ్ జట్టు టెస్టుల్లో వరల్డ్ చాంపియన్ అన్న సంగతి మరువరాదని, తాము ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించబోమని కివీస్ చాటి చెప్పారని లక్ష్మణ్ కొనియాడాడు. కొన్ని నెలల కిందట ఇంగ్లండ్ లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ ప్రపంచ విజేతగా నిలవడం తెలిసిందే.