Parliament: క్షమాపణ చెప్పకపోతే 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదు: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి

Apologies Chairman First Then We consider Revocation of Suspension Center On 12 Suspended MPs

  • క్షమాపణ చెబితే ఆలోచిస్తామన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
  • సభ గౌరవాన్ని కాపాడేందుకే వారిపై సస్పెన్షన్
  • రూల్స్ ప్రకారం అన్నింటిపైనా చర్చించేందుకు సిద్ధమని వెల్లడి

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు 12 మంది విపక్ష సభ్యులను రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేయడంపై దుమారం రేగింది. గత సెషన్ లో వెల్ లోకి దూసుకొచ్చి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. పేపర్లను చింపేసి విసిరేశారు. మళ్లీ ఇలాంటిది జరగకుండా ముందు జాగ్రత్తగా ఆ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, క్షమాపణ చెబితేనే సస్పెన్షన్ ఎత్తేస్తామని, లేదంటే సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. సభ గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయాల్సిందిగా ప్రభుత్వం ప్రతిపాదించిందని పేర్కొన్నారు. తాము చేసిన తప్పునకు ఆ 12 మంది ఎంపీలు చైర్మన్ ను క్షమాపణ కోరితే.. అప్పుడు వారి సస్పెన్షన్ ను ఎత్తేసే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.

నిబంధనల ప్రకారం ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతామని ఆయన అన్నారు. రేపట్నుంచి సభలో అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉందని, కాబట్టి సభా సమావేశాలు ఫలప్రదంగా జరిగేందుకు ప్రతి పార్టీ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాటిపై ఆరోగ్యకరమైన చర్చకు సహకరించాలన్నారు.

  • Loading...

More Telugu News