Mohan Babu: ఒక సాహిత్య శిఖరం నేలకొరిగింది: మోహన్ బాబు
- సిరివెన్నెల సరస్వతీ పుత్రుడు
- నాకు అత్యంత సన్నిహితుడు
- ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి
- నివాళులు అర్పించిన మోహన్ బాబు
తెలుగు పాటకు నగిషీలు చెక్కిన రచయిత .. తెలుగు పదాలకు వన్నెలు దిద్దిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ప్రేమ .. విరహం .. వియోగంతో కూడిన పాటలు మొదలు, సమాజాన్ని తట్టిలేపే ఉద్యమపూరితమైన పాటలను సైతం ఆయన రాశారు. ఆయన పాటల్లో వేదాంతం కనిపిస్తుంది .. తత్త్వం వినిపిస్తుంది.
'తరాలి రాదా తనే వసంతం .. తన దరికి రాని వనాల కోసం' అనే ఒక్క పంక్తి చాలు ఆయన సాహిత్య పరిజ్ఞానానికి అద్దం పట్టడానికి. పాటకి ఆయనంటే ఇష్టం .. ఆయనకి పాట అంటే ప్రాణం. అందువల్లనే చివరి వరకూ ఆయన పాట పట్టుకునే తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలాంటి ఆయన అనారోగ్య కారణాల వలన ఈ సాయంత్రం తుది శ్వాస విడిచారు.
పలువురు సినీ ప్రముఖులు సిరివెన్నెలకి అశ్రు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మోహన్ బాబు స్పందిస్తూ .. "సిరివెన్నెల సరస్వతీ పుత్రుడు .. నాకు అత్యంత సన్నిహితుడు .. విధాత తలపున ప్రభవించిన ఒక సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అంటూ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.