Kangana Ranaut: సాటి మహిళగా ఆ బెదిరింపులపై పంజాబ్ సీఎంకు చెప్పండి: సోనియాగాంధీకి కంగన విజ్ఞప్తి

Bollywood Actress Kangana Requests Sonia Gandhi
  • ముంబై ఉగ్రదాడుల తరహా ఘటనల్లో దేశద్రోహుల హస్తం ఉందని ట్వీట్
  • పంజాబ్‌లోని భటిండా నుంచి బహిరంగ బెదిరింపులు
  • హిమాచల్‌ప్రదేశ్‌లో ఫిర్యాదు
  • తనకేమైనా జరిగితే వారిదే బాధ్యతన్న కంగన
ముంబై ఉగ్రదాడుల తరహా ఘటనల్లో దేశ ద్రోహుల హస్తం ఉందంటూ బాలీవుడ్ ప్రముఖ నటి కంగన రనౌత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల తర్వాత ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి కంగనను చంపేస్తానని బహిరంగంగానే బెదిరించాడు. తనకు వచ్చిన బెదిరింపులపై కంగన హిమాచల్‌ప్రదేశ్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ పత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఇలాంటి బెదిరింపులకు తాను లొంగే రకం కానని కంగన తేల్చి చెప్పారు. వారు ఎవరైనా కావొచ్చని, అమాయక జవాన్లను చంపిన నక్సలైట్లు, పంజాబ్ నుంచి ఖలిస్థాన్‌ను విడదీయాలని కలలు కంటూ విదేశాల్లో కూర్చున్న ఉగ్రవాదులైనా కావొచ్చని అన్నారు. ఇక, భటిండా నుంచి తనకు వచ్చిన బహిరంగ బెదిరింపులపై స్పందిస్తూ.. ఈ విషయంలో తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా పంజాబ్ ముఖ్యమంత్రిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కంగన విజ్ఞప్తి చేశారు.

మీరు కూడా ఒక మహిళేనని, ఇందిరా గాంధీ చివరి క్షణం వరకు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. అలాంటి విద్రోహశక్తుల నుంచి వస్తున్న బెదిరింపులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పంజాబ్ సీఎంను ఆదేశించాలని కోరారు. భవిష్యత్తులో తనకు ఏమైనా జరిగితే అందుకు ద్వేషపూరిత రాజకీయాలు చేసే వారు మాత్రమే దీనికి బాధ్యత వహిస్తారని కంగన హెచ్చరించారు.
Kangana Ranaut
Bollywood
Sonia Gandhi

More Telugu News