AP Govt: 'సిరివెన్నెల' ఆసుపత్రి బిల్లులు మొత్తం చెల్లించిన ఏపీ ప్రభుత్వం... ఇంటి స్థలం మంజూరుకు ఆదేశాలు!
- గీత రచయిత సిరివెన్నెల కన్నుమూత
- కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- సిరివెన్నెల కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం
- ఆసుపత్రి బిల్లులు చెల్లింపు
- అడ్వాన్స్ తిరిగిచ్చేలా చర్యలు
తెలుగు ప్రజలు గర్వించదగ్గ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే, ఆయన ఆసుపత్రి బిల్లులు మొత్తం ఏపీ ప్రభుత్వం చెల్లించింది. అంతేకాదు, వారు ఆసుపత్రిలో కట్టిన అడ్వాన్స్ మొత్తాన్ని కూడా తిరిగి ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని సిరివెన్నెల కుటుంబం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఈ కష్టకాలంలో తమకు ఎంతో ఊరట కలిగించిందని, తమ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సిరివెన్నెల కుమారుడు, టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి యోగేశ్వర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సిరివెన్నెల కుటుంబానికి ఏపీలో స్థలం మంజూరుకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.