Uber: వాట్సాప్ లో క్యాబ్ బుకింగ్.. ప్రపంచంలోనే తొలిసారిగా భారత్ లో ఊబెర్ కొత్త ఫీచర్.. ఇలా బుక్ చేసుకోవచ్చు!

Uber Allows Users To Book Cab From Whatsapp New First In Global Feature In India
  • పైలట్ ప్రాజెక్టుగా లక్నోలో అమలు
  • త్వరలోనే అన్ని నగరాలకూ విస్తరణ
  • మెసేజ్, క్యూఆర్ కోడ్ స్కాన్, వాట్సాప్ చాట్ కు కనెక్ట్ అవడం ద్వారా బుకింగ్
ప్రస్తుతం క్యాబ్ బుక్ చేసుకోవాలంటే యాప్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అయితే, యాప్ లేకుండా ఫ్రెండ్ కు మెసేజ్ చేసినంత సులువుగా క్యాబ్ ను బుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అదే ఆలోచన చేసింది ఊబెర్. యాప్ అవసరం లేకుండానే ‘వాట్సాప్’లో క్యాబ్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఊబెర్ అఫీషియల్ చాట్ బోట్ తో కనెక్ట్ అయి క్యాబ్ ను బుక్ చేసుకునే వీలు కల్పించింది.

ఈ ఫీచర్ ను ప్రపంచంలోనే భారత్ లో తొలిసారి తీసుకొస్తున్నట్టు ఊబెర్ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి బుకింగ్ దాకా అన్ని వాట్సాప్ తోనే జరిగిపోతాయని తెలిపింది. ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కేవలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోనే దీనిని అమలు చేయనున్నారు. అతి త్వరలోనే మిగతా నగరాలకూ దానిని విస్తరించనున్నారు. ప్రస్తుతం ఇంగ్లిష్ లోనే అందుబాటులో ఉన్నా.. త్వరలో మిగతా భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇలా బుక్ చేసుకోవాలి..

వాట్సాప్ ద్వారా మూడు రకాలుగా క్యాబ్ ను బుక్ చేసుకునే అవకాశాన్ని ఊబెర్ కల్పించింది. ఊబెర్ బిజినెస్ అకౌంట్ నంబర్ కు మెసేజ్ పంపించడం ద్వారా, క్యూర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా, ఊబెర్ వాట్సాప్ చాట్ కు కనెక్ట్ చేసే లింక్ ను క్లిక్ చేయడం ద్వారా క్యాబ్ ను బుక్ చేసుకోవచ్చు. మూడింట్లో ఏదో ఒక పద్ధతిని ఎంపిక చేసుకున్న తర్వాత.. పికప్, డ్రాప్ లొకేషన్లను అడుగుతుంది. ఆ వెంటనే అక్కడకు వెళ్లేందుకు అయ్యే చార్జీని, డ్రైవర్ రావడానికి పట్టే టైంను వెల్లడిస్తుంది. అంతే.. క్యాబ్ బుకింగ్ అయిపోయినట్టే.

యాప్ లో ఉండే అన్ని సౌకర్యాలను వాట్సాప్ బుకింగ్ ద్వారా కూడా ఊబెర్ అందించనుంది. భద్రత, బీమా వంటి వసతులను సమకూర్చనుంది. యాప్ లో ఉండే భద్రతా ఫీచర్లనే వాట్సాప్ బుకింగ్ లోనూ పెడుతుంది. బుకింగ్ సమయంలో డ్రైవర్ పేరు, లైసెన్స్ ప్లేట్ వివరాలను యూజర్ కు తెలియజేస్తుంది.

భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు వాట్సాప్ చాట్ లో ఊబెర్ అందిస్తుంటుంది. ఎమర్జెన్సీ సమయాల్లో ఊబెర్ కు ఫిర్యాదు చేసే సమాచారాన్ని ఇస్తుంది. ప్రయాణ సమయంలో ఎమర్జెన్సీ ఆప్షన్ ను క్లిక్ చేస్తే.. వెంటనే ఊబెర్ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వస్తుంది. ప్రయాణం ముగిసిన తర్వాత అరగంటదాకా యూజర్లకు ఊబెర్ సేఫ్టీ లైన్ నంబర్ అందుబాటులో ఉంటుంది.
Uber
Cab Booking
Whatsapp
India

More Telugu News