Anil Kumar Yadav: డిసెంబరు ఒకటో తేదీ నాటికి పోలవరం పూర్తిచేస్తామన్న మాట నిజమే, కానీ..: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- గత ప్రభుత్వ తప్పిదాల వల్లే పూర్తిచేయలేకపోయాం
- ఒకేసారి స్పిల్ వే, కాఫర్ డ్యాంలను కట్టారు
- అవి సగం సగమే పూర్తయ్యాయి
- వరదల వల్ల ఆ రెండూ దెబ్బతిన్నాయి
- పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం
1 డిసెంబరు 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని గతంలో తాము చెప్పిన మాట నిజమేనని ఏపీ జలవనరులశాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ అంగీకరించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయామన్నారు. నిన్న నెల్లూరు జిల్లా గూడూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. గత ప్రభుత్వం స్పిల్ వే, కాఫర్ డ్యాంలను ఒకేసారి కట్టిందని, అవి సగం సగమే పూర్తయ్యాయని అన్నారు.
గతేడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రం వాల్, దిగువన కాఫర్ డ్యాం దెబ్బతిన్నదని తెలిపారు. రెండు కిలోమీటర్లు నదిలో పోవాల్సిన వరదను మార్చి పంపడంతోనే డ్యాం దెబ్బతిందని పేర్కొన్నారు. ఇలాంటి సాంకేతిక కారణాల వల్లే అనుకున్న లక్ష్యం మేరకు ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయామని మంత్రి వివరించారు. అయితే, తమ ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతోనే ఉందని పేర్కొన్నారు.