Karnataka: ఒమిక్రాన్ దృష్ట్యా కర్ణాటకలో కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం
- కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు
- రెండు కేసులు బెంగళూరులోనే నమోదు
- రెండు డోసులు తీసుకుంటేనే బహిరంగ ప్రదేశాల్లో అనుమతి
- విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు తప్పనిసరి
కర్ణాటకలో ఇప్పటికే ఇద్దరికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ రెండు కేసులు బెంగళూరులోనే వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలకు తెరలేపింది. ప్రత్యేకంగా కొవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికే కార్యాలయాలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి అనుమతించనున్నారు.
అటు, విద్యార్థుల తల్లితండ్రులకు రెండు డోసులు తప్పనిసరి చేసింది. భారీ వేడుకలు, కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను 500కి పరిమితం చేసింది. విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందేనని ఆదేశించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రస్తుతానికి రాత్రిపూట కర్ఫ్యూ విధించలేదని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.