Andhra Pradesh: మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించడం మీ స్థాయికి తగదు.. విరమించుకోండి: జగన్‌కు అమరావతి రైతుల విజ్ఞప్తి
- అధికారంలోకి వస్తే అందరూ మెచ్చే రాజధానిని నిర్మిస్తామన్నారు
- ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రగతికి మేం అడ్డుకాదు
- అందరికీ మేలు చేసే నిర్ణయం తీసుకోండి
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సరికాదని, కాబట్టి ఆ ఆలోచన విరమించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అమరావతి రైతులు విజ్ఞప్తి చేశారు. అందరూ మెచ్చేలా రాజధానిని నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడేమో మూడు రాజధానులు అంటూ మాట తప్పడం సరికాదని అన్నారు. తాము ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రగతికి ఎంతమాత్రమూ అడ్డం కాబోమన్నారు. అందరికీ మేలు చేసే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన నిన్నటికి 717వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళలు తుళ్లూరులో న్యాయదేవతకు పూజలు చేసి గీతాపారాయణం చేశారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా పలు గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.