Telangana: ఆనాటి రచ్చబండలే నేటి వివాద పరిష్కార వ్యవస్థలకు మూలం: సీఎం కేసీఆర్
- వాటికి ప్రత్యామ్నాయాలే ఆర్బిట్రేషన్ కేంద్రాలు
- ఆలస్యమైనా హైదరాబాద్ కు రావడం సంతోషం
- 25 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు
- సొంత భవనం కోసం పుప్పాలగూడలో భూమి ఇస్తామని హామీ
ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పెండింగ్ లో ఉన్న విదేశీ కేసుల విచారణ కోసం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రాన్ని (ఐఏఎంసీ) ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆలస్యంగానైనా ఏర్పాటు చేశారని, అందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు అని ఆయన చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన ఐఏఎంసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
పూర్వం ఊర్లలో ఏవైనా వివాదాలు వస్తే రచ్చబండ పెట్టి సమస్యను పరిష్కరించేవారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వివాద పరిష్కార వ్యవస్థలన్నీ దాని నుంచి వచ్చినవేనని చెప్పారు. దానికి ఇప్పుడు మంచి ప్రత్యామ్నాయంగా ఆర్బిట్రేషన్ మారిందన్నారు. ఐటీ రంగం, ఇతర మౌలిక వసతుల దృష్ట్యా ఆర్బిట్రేషన్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలోని వివిధ నగరాలతో పాటు ప్రపంచానికి హైదరాబాద్ నుంచి మంచి కనెక్టివిటీ ఉందని పేర్కొన్నారు.
ఫార్టూన్ 500లోని గ్లోబల్ కంపెనీలూ హైదరాబాద్ లో ఉన్నాయన్నారు. ఎన్నో శతాబ్దాలుగా హైదరాబాద్ బహుళ సంస్కృతులు, బహుళభాషలున్న నగరమని, వాతావరణ పరంగానూ బాగుంటుందని, ఈ నేపథ్యంలో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని సీఎం కేసీఆర్ చెప్పారు. కొన్నికొన్నిసార్లు సంస్థలకు ఒప్పంద వివాదాలు వస్తుంటాయని, కొన్నిసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వివాదాల్లో భాగమవుతుంటాయని చెప్పారు.
సరిపడినన్ని కోర్టులు లేకపోవడం, న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల అనేక సంస్థల వివాదాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. దాని వల్ల ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్లలో తేడాలొచ్చి సంస్థ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులేర్పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎంసీ ఏర్పాటు పెద్ద ఊరటనిస్తుందని కేసీఆర్ చెప్పారు.
కాగా, ప్రస్తుత ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని 25 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా ఈ కేంద్రానికి భూమిని కూడా కేటాయిస్తామని చెప్పారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఎంపిక చేసిన ప్రకారం.. సొంత బిల్డింగ్ కోసం పుప్పాలగూడలో భూమిని కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.