Andhra Pradesh: జవాద్ తుపానుపై ఐఎండీ అప్ డేట్.. ఏపీలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

Jawad Red alert for AP 3 Districts

  • విశాఖకు 210 కిలోమీటర్ల దూరంలో తుపాను
  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం
  • తరలింపులను ముమ్మరం చేసిన ఏపీ, ఒడిశా
  • రేపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం

జవాద్ తుపానుపై భారత వాతావరణ కేంద్రం తాజా అప్ డేట్ ను ఇచ్చింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అది కేంద్రీకృతమైనట్టు వెల్లడించింది. గత ఆరుగంటలుగా అది గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతూ.. ఇవాళ తెల్లవారుజామున 5.30 గంటలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఈశాన్యాన 210 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి నైరుతిన 410 కిలోమీటర్లు, పారాదీప్ కు నైరుతి దిక్కున 490 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పింది.
 
రాబోయే 12 గంటల్లో పూరీ తీరానికి చేరి తీవ్రమైన వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఏపీ, ఒడిశా అధికారులు తరలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఇవాళ రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ఒడిశాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్ సింగ్ పూర్ లకూ రెడ్ అలర్ట్ ను ఇచ్చారు.

  • Loading...

More Telugu News