jawad: జవాద్ తుపాను ఎఫెక్ట్.. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో 74 రైళ్లు రద్దు
- నేడు బయలుదేరాల్సిన 36 రైళ్లు రద్దు
- రేపు, ఎల్లుండి పలు స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన 38 రైళ్లు కూడా
- వాటిలో అధిక శాతం రైళ్లు విశాఖపట్నం, హౌరా, పూరీలోవే
బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉండడంతో 74 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. నేడు బయలుదేరాల్సిన 36 రైళ్లను రద్దు చేసింది. వాటిలో అధిక శాతం రైళ్లు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, ఒడిశాలోని పూరీ నుంచి బయలుదేరాల్సిన రైళ్లే ఉన్నాయి.
అలాగే, రేపు, ఎల్లుండి పలు స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన 38 రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే, పలు ప్రాంతాల మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వివరించారు. న్యూ తింసుకియా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (22502)ను భువనేశ్వర్-విశాఖపట్నం మార్గం మీదుగా తీసుకెళ్లకుండా ఖరగ్‌పూర్-ఝార్సుగూడ,బల్లాహర్సా మీదుగా మళ్లిస్తున్నారు. తుపాను ప్రభావం వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధంగా ఉందని అధికారులు చెప్పారు. తాము ప్రభుత్వంతో పాటు, ఎస్పీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.